రాజీవ్ గాంధీ వల్లే ఈరోజు మనం వాట్సాప్, ట్విట్టర్ వాడుతున్నామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్‌లో ఐటీ ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ. ఈరోజు మనం వినియోగిస్తున్న సెల్ ఫోన్లు రావడానికి కారణం రాజీవ్ గాంధీనే అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ట్వి్ట్టర్ వేదికగా.. “సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. ప్రపంచంలో ప్రతి పది మంది ఐటీ నిపుణుల్లో నలుగురు మనదేశానికి చెందిన వాళ్లు ఉన్నారంటే ఆనాడు రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేయడమే కారణం. ఇవాళ చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇవాళ వాట్సాప్, ట్విట్టర్ , ఐటీ రంగంలో మార్పులు, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. మారుమూల తండాల్లోకి ఫోన్లు రావడానికి కారణం ఆయనే.” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని రేవంత్రెడ్డి విమర్శించారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచిపెడుతున్నారని, తెలంగాణ సంపదను సీఎం కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడితే బీజేపీ విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో మణిపూర్ ఘటనపై ఒక్క మాట అనని బీఆర్ఎస్, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.