ఏపీ సీఎం జగన్ను విలన్గా చూపించే కుట్ర సాగుతోందా? ఆయనకు పాలన చేతకాదు.. ప్రజలతో మెలగడం చేతకాదు.. అభివృద్ధి చేతకాదు.. అనేలా విష ప్రచారం జరుగుతోందా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జగన్పై కుట్రలు నెలకొన్నాయా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. జగన్ అధికారంలోకి రావడాన్ని ప్రజలు ఇష్టపడినా.. ఢిల్లీలోని కొందరు పెద్దలకు ఇష్టంలేదు. అదే విధంగా ఓ కీలకమైన సామాజిక వర్గానికి కూడా ఇష్టం లేదు. దీంతో వీరు ఇప్పుడు జగన్పై కుట్రలకు తెరదీశారని తెలుస్తోంది.
జగన్ను విలన్గా ప్రమోట్ చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన పాలనను ప్రొజెక్ట్ చేయడంతోపాటు.. దళితులపై జరుగుతున్న దాడులను కూడా అడ్డు పెట్టుకుని జగన్ను నగుబాటు చేయడంతోపాటు.. పాలన విషయంలో జీరో అనేలా ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక, వీరికి కలిసి వస్తున్న మరో ప్రధాన విషయం కరోనా. ప్రస్తుతం కరోనా కట్టడిలో ఏపీ చేతులు ఎత్తేసిందని ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టాయి. బీజేపీ-టీడీపీలు అంతర్గతంగా చేసుకున్న ఒప్పందాల మేరకు జగన్ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నాయి.
వాస్తవానికి కరోనా కట్టడి విషయంలో కేంద్రమే చేతులు ఎత్తేసింది. కేంద్రం రాష్ట్రాలకు తగినన్నినిధులు ఇవ్వకపోగా.. లాక్డౌన్ కాలంలోనూ మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది. ఫలితంగానే కేసులు ఎక్కువయ్యాయి. ఇక, విదేశాలకు విమానాలను నడపడాన్ని కూడా ప్రోత్సహించింది. ఈ పరిణామంతోనే చాలా వరకు వైరస్ విస్తృతి పెరిగిపోయింది. ఇక, రాష్ట్ర పరిస్థితిని తీసుకుంటే.. ఆదిలోను.. ఇప్పుడు కూడా కరోనా విషయంలో మాటలు ఎలా ఉన్నా.. చేతల్లో మాత్రం బాగానే పనిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించింది. అయినప్పటికీ.. జగన్ను బద్నాం చేయడంలో భాగంగా దీనిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
వీటికితోడు ఇటీవల కాలంలో జరుగుతున్న దళితులపై దాడులను కూడా ప్రతిపక్షాలు వినియోగించుకుంటున్నాయి. వీటన్నింటినీ ప్రొజెక్ట్ చేయడంతోపాటు.. రాష్ట్రంలో అభివృద్ధి చేయడం లేదనే వాదనను కూడా బలంగా వినిపించి.. తద్వారా జగన్ను ఒక విలన్గా చిత్రీకరించాలని భావిస్తున్నాయి. దీనికిగాను బీజేపీ-టీడీపీ.. ఈ రెండు పార్టీలతోనూ మిత్రత్వం ఉన్న జనసేన కూడా చేతులు కలిపిందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో జగన్ను తీవ్రస్థాయిలో విమర్శించడం ద్వారా ప్రభుత్వం బర్తరఫ్ అయ్యేలా పావులు కదుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం.