మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒకటి రెండు చోట్ల మాత్రం స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో నిమిషాల్లో సర్దుమణిగాయి. నియోజకవర్గం బయటు ఉన్న ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉన్నారు. మునుగోడులో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
బీజేపీ మద్యం, నగదు పంపిణీ చేస్తోందని రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ కు రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. చౌటుప్పల్, జనగామ, చండూరు, తుమ్మలపల్లిలో పంపిణీ జరుగుతున్నట్లు చెప్పిన ఆయన.. నిబంధనలకు విరుద్ధంగా నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఈవో వికాస్‌రాజ్‌కు ఫోన్ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.