భాగ్యనగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. మహిళలంతా తీరొక్క పూలతో బతుకమ్మలను ముస్తాబు చేశారు. మహిళలంతా కలిసి కోలాహలంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడానికి నగర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుల తెలిపారు. ఆంక్షల సమయంలో నిజాం కాలేజ్, బషీర్‌బాగ్ కూడలి, కంట్రోల్ రూమ్, ఆర్బీఐ, లక్డీకాపూల్, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి కూడళ్ల వైపు వెళ్లొద్దని సూచించారు.
ఎల్బీ స్టేడియంలో వేడుకలకు వచ్చే వారి వాహనాల కోసం పలు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీఐపీలు, అధికారుల కోసం ఎల్బీ స్టేడియం టెన్నిస్ మైదానం, మీడియా వాహనాలకు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం వద్ద కేటాయించినట్లు తెలిపారు. స్టేడియానికి వచ్చేవారిని తీసుకొచ్చే బస్సులను బుద్ధ భవన్ వెనుక పార్క్ చేయాలని సూచించారు.
నిజాం స్టేడియం మైదానంలోనూ పార్కింగ్‌కు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేడు ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశమున్నందున అప్‌డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని సూచించారు.