మునుగోడు పోరు షురూ..లెక్కలు మారనున్నాయా?

-

ఎట్టకేలకు మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది..ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా, నవంబర్ 3న ఎన్నిక జరగనుంది..నవంబర్ 6న ఫలితం వెలువడనుంది. అంటే సరిగ్గా చూసుకుంటే ఒక నెలలో మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోతుంది..ఎవరు గెలుస్తారో..ఎవరు ఓడిపోతారో తెలిసిపోతుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.దాన్ని స్పీకర్ ఆమోదించినప్పుడే మునుగోడుపై అన్నీ పార్టీలు దృష్టి పెట్టేశాయి.

ఇప్పటికే టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ పార్టీల నేతలు మునుగోడు ప్రచార బరిలో దిగేశారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టికుని, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తూ..అధికార బలంతో సత్తా చాటాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు రెండు ఉపఎన్నికల్లో ఝలక్ ఇచ్చిన బీజేపీ..మునుగోడులో కూడా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అటు తమకు పట్టున్న స్థానంలో ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్ పనిచేస్తుంది.

అందరికంటే ముందే కాంగ్రెస్ తరుపున పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ఖరారు చేసి ప్రచారంలో తిరుగుతున్నారు. ఇటు బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన్ని అధికారికంగా అభ్యర్ధిగా ప్రకటించేశారు. ఇక టీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతారని తెలుస్తోంది..కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఏదేమైనా గాని ఈ సారి మునుగోడులో మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది..ఎవరిది గెలుపు అనేది ఇప్పుడు చెప్పలేని పరిస్తితి. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరుపున పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపు పక్కా అని అందరికీ అర్ధమైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన విజయం సాధించారు.

కానీ మునుగోడులో అలా చెప్పడానికి లేకుండా పోయింది.. ఎప్పటికప్పుడు బలాబలాలు మారిపోతున్నాయి. సర్వేలకు కూడా పక్కా రిజల్ట్ అంతు చిక్కడం లేదు. కానీ మెజారిటీ సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే ఎన్నిక జరిగే రోజు కూడా సమీకరణాలు మారిపోతాయి కాబట్టి.. మునుగోడులో ఎవరు సత్తా చాటుతారో అంచనా వేయలేని పరిస్తితి. మొత్తానికి మునుగోడు పోరు రసవత్తరంగా సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news