వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు పార్టీలూ కలిసి ఒక వ్యూహం అమలు చేయనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను కూడా సిద్ధం చేశారు అని తెలుస్తోంది.2014 ఫ్యార్ములాను మరోసారి పునారవృతి చేసేందుకు ఆ మూడు పార్టీలూ సిద్ధం అయితే వైసీపీ ఇక కష్టమే! ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు,గెలుపు అవకాశాలు బేరీజు వేసేందుకు టీడీపీ మరియు జనసేన తమ తమ దారుల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.ఇందుకు జిల్లాలలో పనిచేస్తున్న కొందరు పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా సాయం తీసుకుంటున్నారు అని కూడా సమాచారం.
అదేవిధంగా కార్యకర్తల మనోభావాలు కూడా పరిగణనలోకి తీసుకుని క్యాండెట్ ఎంపిక ఉంటుందని గతంలో టికెట్ ఇచ్చినా కూడా ప్రత్యర్థి పార్టీకి సహకరించిన అభ్యర్థులు సైతం ఉన్నారని ఇప్పటికే టీడీపీ మరియు జనసేన నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాయి.ఈ తరుణంలో అభ్యర్థుల సమర్థతకు ప్రామాణికంగా వారు గతంలో పనిచేసిన విధానం,ఒకవేళ ఎమ్మెల్యేగా ఉంటే అప్పుడు చేపట్టిన అభివృద్ధి, అప్పట్లో ఉన్న ప్రజా విశ్వాసం ఇప్పటికీ అదే విధంగా ఉందా అన్నవి ఇవాళ ఇరు పార్టీలకూ ఓ విధంగా కొలమానాలే. ఈ దశలో ఆ రెండు పార్టీలూ తమదైన రీతిలో సర్వేలు నిర్వహించి అటుపై అభ్యర్థి నిర్ణయం పొత్తు ధర్మంలో భాగంగా తేల్చనున్నాయి.
గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు ఎలా చూసుకున్నా విభిన్నమే! వైసీపీ పై పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. గ్రామ సచివాలయ వ్యవస్థ అనే కాన్సెప్ట్ బాగుంది. వలంటీర్ సిస్టమ్ లో జీతాలు పెంచితే వాళ్లు కూడా ఇంకా బాగా పనిచేసేందుకు వీలుంది.ఇవి కాకుండా జగన్ ఇచ్చే పథకాలు బాగున్నాయి. ఇంకేం కావాలి. ఏం చూసుకున్నా అభివృద్ధి లేదు. అప్పుల ఊసు చెప్పుకోలేని రీతిలో ఉంది.
ఈ రెండూ వచ్చే ప్రభుత్వాలు కూడా పరిష్కరించాల్సిన విషయాలే కనుక వీటిపై ఫోకస్ చేసి మాట్లాడడం ఇప్పుడు ఆ రెండు పార్టీల వంతు.అయితే ఎన్నికల్లో వ్యవస్థాగత తప్పులపై మాట్లాడకుండా వ్యక్తిగత జీవితాలపై వైసీపీ కానీ టీడీపీ కానీ మాట్లాడితే అంతకుమించిన ఘోరం మరొకటి ఉండదు.ఇక ఇదే సమయంలో బీజేపీ కూడా సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే పవన్ తో ప్రయాణించాలని అనుకుంటోంది.ఎలా చూసుకున్నా ఓ అరవై స్థానాలు జనసేనవి అని తెలుస్తోంది. ఓ పదిహేను స్థానాలు బీజేపీవి మిగిలిన వంద స్థానాలు టీడీపీవి అని పోటీ కి సంబంధించి ఇప్పుడు తేలిన ఓ ప్రాథమిక గణాంకం లేదా లెక్కల రూపం.