చీరాల వైసీపీలో నానాటికీ పోరు పెరుగుతోంది. గత ఏడాది ఎన్నికలకు ముందు కేవలం ఒకే ఒక నాయకుడిగా ఉన్న వైసీపీ ఇప్పుడు త్రిముఖంగా మారిపోయింది. ముగ్గురు నాయకులు నియోజకవర్గంపై ఆధిపత్య పోరుకు సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీ అధికారంలో ఉండి కూడా ఇక్కడి ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోపక్క, పార్టీలోనూ నేతలు, కార్యకర్తలు ఎవరికి వారే.. అన్న విధంగా మూడు జట్లుగా విడిపోయి.. రాజకీయం చేసుకుంటున్నారు. చీరాలలో నెలకొన్ని ఈ పరిస్థితి వైసీపీకి తలనొప్పిగా మారడంతోపాటు.. ప్రత్యర్థి పార్టీలకు ఆటపట్టుగా మారింది.
గత ఏడాది ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్.. ఒక్కరే బలైన నాయకుడుగా ఉన్నారు. వైసీపీలో అన్నీ తానై వ్యవహరించారు. కార్యకర్తలను సమీకరించారు. తన మాట నెగ్గేలా చక్రం తిప్పారు. అయితే, తర్వాత మారినరాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నుంచి విజయం సాధించిన టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాంను జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. ఫలితంగా అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఆధిపత్యం కోసం పోరాటం ప్రారంభించారు.
ఎమ్మెల్యే నేనే కాబట్టి.. నేనే అధికారం చలాయించాలనే ధోరణిలో కరణం ఉన్నారు. కానీ, పార్టీలో నేనే ముందు.. నువ్వు వలస జీవివి కాబట్టి.. అణిగిమణిగి ఉండాలనే ధోరణితో ఆమంచి వ్యవహరిస్తున్నారు. కరణం పార్టీలోకి వచ్చినా ఇప్పటకీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా ఆమంచే ఉన్నారు. వీరి మధ్య నియోజకవర్గం విషయంలోనూ రగడ చోటు చేసుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో తమకు అనుకూలంగా వ్యహరించిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతను కూడా వైసీపీలోకి చేర్చుకున్నారు.
ఇప్పుడు ఆమె కూడా చీరాలలో ప్రతాపం చూపించేందుకు రెడీ అయ్యారు. ఆమంచి, కరణంలను మించిన రాజకీయాలు చేయాలని సునీత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక, ఇప్పుడు వైసీపీలో తనకంటూ.. ఓ డయాస్‌ను ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆమె నిత్యం ఘర్షణలకు సై అంటున్నారు. ఏదేమైనా ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వైసీపీలో ఎప్పుడు అయితే టీడీపీ వలస నేతలు ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి స్థానిక వైసీపీ కేడర్‌తో పాటు అటు అధిష్టానానికి సైతం పెద్ద తలనొప్పిలా ట్రయాంగిల్ ఫైట్ ముదురుతోంది.
-vuyyuru subhash