తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తాయ ని అన్నారు. నిజానికి ఇప్పటి వరకు చాలా మంది చోటా నాయకులు ఇదే విషయం మాట్లాడారు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా.. చంద్రబాబు వంటి.. డిల్లీలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకు డు హాట్ కామెంట్ పేల్చడంతో ఒక్కసారిగా ఆసక్తి రేగింది. ఏదో ఒక సూచన, హింటు లేకుండా చంద్రబా బు లాంటి నాయకుడు ఊసుపోక కబుర్లు చెప్పరు కదా! అనుకున్నారు అందరూ. సరే! ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే.. ఎవరికి లాభం? టీడీపీకా.? వైసీపీకా? అనేది ఆసక్తిగా మారింది.
ముందు టీడీపీ విషయాన్ని పరిశీలిస్తే.. జమిలి ఎన్నికలు వస్తే.. ఒకింత లాభించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రధానంగా రాజధాని విషయం వర్కవుట్ అవుతుంది. అదేసమయంలో.. చంద్రబాబు గ్రాఫ్ ఇటీవల పెరిగిన నేపథ్యంలో అదికూడా పార్టీకి లాభించే అవకాశం ఉంది. ఇక, పార్టీలో ఇటీవలే కొత్తగా పదవులు ఇచ్చారు. వారంతా కూడా దూకుడుగా రాజకీయాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక, పార్టీకి కొత్తగా వచ్చిన అధ్యక్షుడు అచ్చెన్న కూడా రాజకీయ దూకుడు పెంచారు. ఇటీవల జరిగిన తుఫాను నష్టాల నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ కూడా జిల్లాల్లో పర్యటించారు.
ఇలా.. పార్టీ ఒకవిధంగా దూకుడుగా ఉంది. మరో ఏడాది ఇదే రేంజ్‌లో కొనసాగితే.. పార్టీకి మంచి ఊపు వస్తుందనే భావన చంద్రబాబులో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన జమిలి వైపు మొగ్గు చూపుతు న్నారు. ఇక, వైసీపీ వైపు చూస్తే.. ఆ పార్టీ ఓవర్ హెడ్ ట్యాంకు బాగున్నా.. క్షేత్రస్థాయిలో కుళాయిలు కంపు కొడుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎక్కడికక్కడ నాయకులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే.. సీఎం జగన్ మాత్రం అనేక సంక్షేమ పథకాలతో పేదలు, మహిళలు, వృత్తి దారులకు చేరువ అయ్యారు. దీంతో జమిలే కాదు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదనే ధోరణిలో వైసీపీలో ఉంది.
అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ.. జమిలిపై భారీగానే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. విశ్లేషకుల అభిప్రాయం వేరేగా ఉంది. జమిలి వచ్చి.. ఎన్నికలు జరిగినా.. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం కష్టమేననిఅంటున్నారు. అదేసమయంలో వైసీపీకి గత ఏడాది వచ్చినన్ని సీట్లు కూడా దక్కే ఛాన్స్ లేదని కుండబద్దలు కొడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. బొటాబొటీ మెజారిటీనే దక్కుతుందని చెబుతున్నారు. మొత్తానికి బాబు ఆశలు బాగున్నా.. ఫలితంపై మాత్రం ఆ పార్టీలోనూ నమ్మకం లేక పోవడం గమనార్హం.