టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యల వివాదం కొత్త మలుపు తిరిగింది. మతం, కులం వంటి సున్నితమైన అంశాలలో ఆయన చేసిన వ్యాఖ్యల పై ఐపీఎస్ ఆఫీసర్ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఫైరయ్యారు. అధికార పార్టీనా ఇంకొకటా అని చూడకుండా ఎమ్మెల్యే పై ఘాటుగానే విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లతొ హోరెత్తించారు. ఇప్పుడి వివాదం పై ఆధికార..అనాధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఈ మధ్య వరుస వివాదాల్లో ఉన్నారు పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారడ్డి. మతం, కులం వంటి సున్నితమైన అంశాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు అగ్గిరాజేస్తే.. దళిత సంఘాలు మాత్రం నిప్పులు చెరుగుతున్నాయి. ఇతర విపక్ష పార్టీలు ధర్మారెడ్డిని కార్నర్ చేస్తే.. అధికారవర్గాల్లోనూ దీనిపై లోతైన చర్చే జరుగుతోంది. అయితే ఓ ఐపీఎస్ అధికారి మాత్రం ఓపెన్ అయిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకే సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇవ్వడం.. పోస్టింగ్‌లు పెట్టడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
ట్విటర్ పోస్టింగ్‌లలో ఐపీఎస్ ఉపయోగించిన పదజాలం.. చాలా ఘాటుగా ఉందని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఒక ట్వీట్ చేశారు. గంటలోనే ఆ ట్వీట్‌ను తొలగించి.. మరో ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉపసంహరించుకోవడంతో.. వాటిని రెండో ట్వీట్లో ప్రస్తావించారు. అక్కడితో ఆగారా అంటే.. లేదు. అందులోనూ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రవీణ్‌కుమార్.
ఒక ప్రజాప్రతినిధిని నేరుగా విమర్శించడం..అదీ యూనిఫామ్ సర్వీస్‌లో ఉన్న అధికారి స్పందించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఐపీఎస్‌గా ఒక హోదాలో ఉన్న వ్యక్తి చేసిన ట్విటర్ పోస్టింగ్స్ వెనక ఆంతర్యం ఏంటో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా యూనిఫాం సర్వీస్‌లో ఉన్నవారికి సంతోషం వచ్చినా.. దుఃఖం కలిగినా తమ అసోసియేషన్‌లో చర్చించిన తర్వాతే ప్రకటన చేస్తారు. పరిస్థితి తీవ్రతను బట్టి అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడతారు. ఇక్కడ ప్రవీణ్‌కుమార్ ఒక ఐపీఎస్‌గా కాకుండా.. ఒక రాజకీయ నేతగా రియాక్ట్ అయ్యారా అని చెవులు కొరుక్కుంటున్నారు.
ఆ ఐపీఎస్ బావమరిది డాక్టర్ మెతుకు ఆనంద్‌కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచే గెలుపొందడం గమనర్హం. అయితే ప్రభుత్వంలో పెద్దల ఆశీసులు ఉండబట్టే ఈ ఐపీఎస్ అధికారి.. ఎమ్మెల్యే పై విమర్శలు చేసే స్థాయికి ఎదిగారనే విమర్శలు ఉన్నాయి. మరి.. ఆయన ఇక్కడితో ఆగుతారో.. తన రాజకీయ విమర్శలకు ఇంకా పదును పెడతారో చూడాలి.