సిటీ శివారు భూ దందాలో మరో ఎమ్మెల్యే !

-

ఆ ఎమ్మెల్యేకు గిల్లుడు వెన్నతో పెట్టిన విద్య. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తెలియాల్సిందే. సెటిల్మెంట్ల కింగ్‌ అంటారు. ఇప్పుడా బాధ్యతలను కుమారుడికి అప్పగించారట. ఆ ఎమ్మెల్యే భూదాహానికి ఓ ఉద్యోగిపై వేటు కూడా పడింది. ఓ రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగిని అడ్డంపెట్టుకుని కథ నడిపించేస్తున్నట్లు పార్టీలోనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

హైదరాబాద్‌ సిటీ శివారుల్లో భూ దందాలు.. ఎమ్మెల్యేల భూ దాహం డొంక ఒక్కక్కటిగా కదులుతోంది. అధికార పార్టీ శాసనసభ్యుల సహకారం ఉండటంతో పోలీస్‌, రెవెన్యూ అధికారులు చెలరేగిపోయారని అంటున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌లో గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న ఓ ఎమ్మెల్యే వ్యవహారం బయటకు వస్తోంది. గతంలో టీడీపీలో పనిచేసిన ఆయన.. తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. అధికార పార్టీలో ఉంటే అడ్డూఆపూ ఉండదని అనుకున్నారో ఏమో.. తన భూ దాహాన్ని తీర్చేసుకుంటున్నారట. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఆయన భూ దందా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలోని బస్‌స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ముస్లింల భూములపై ఆయన కన్ను పడింది. ఆ భూమికి వారసలు ఉన్నా లేనట్టు.. లేనివారు ఉన్నట్టు కనికట్టు చేశారట. ఆ విధంగా ఆ భూమిని కొట్టేయడానికి పెద్ద స్కెచ్చే వేసినట్లు చెబుతారు. అధికార పార్టీలో ఉండటంతో.. అధికారులను సైతం నయానో భయానో దారిలోకి తెచ్చేసుకున్నారు. ఇప్పుడా భూముల వివాదం ఇప్పుడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దగ్గర పేచీ పడింది.

ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మరో రీజినల్‌ రింగ్‌రోడ్డు వేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. కేంద్రం కాస్త బ్రేకులు వేయడంతో స్తబ్దత నెలకొంది. కాకపోతే రీజినల్‌ రింగ్‌ రోడ్డు వచ్చే ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇప్పుడు అక్కడ వెంచర్‌ వేయాలన్నా.. సదరు ఎమ్మెల్యే అనుమతి కావాలి. ఒకవేళ ఎవరైనా వెంచర్‌ వేస్తే.. క్షణాల్లో ఎమ్మెల్యే మనుషులు వాలిపోతారు. అలాగే గ్రామాల్లో వివాదాల్లో ఉన్న భూములపైనా సదరు ఎమ్మెల్యే కన్ను పడింది. ఎక్కడ వివాదం ఉంటే.. అక్కడికి పోలీసులను పంపేస్తారు. భూములకు సంబంధించిన వారిని భయపెట్టి తక్కువ ధరకు కొట్టేస్తారు. ఆపై అవే భూములను ఎక్కువ ధరకు అమ్ముకోవడం ఆ ఎమ్మెల్యేకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా ఇప్పటి వరకూ వందల ఎకరాలు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ల్యాండ్ సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడీ విషయాల్లో తన కుమారుడికి కూడా తర్ఫీదు ఇస్తున్నారట. ఆ క్రమంలో ఓ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు చెబుతారు. ప్రభుత్వ భూములు, ఆయా మతాలకు చెందిన ల్యాండ్స్‌ను ఉచితంగా కొట్టేయడం లేదంటే పర్సెంటేజీలు, కమీషన్లు భారీగా తీసుకోవడం చేస్తారట ఆ ఎమ్మెల్యే. రెవెన్యూ విషయాల్లో ఆరితేరిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని వెంట పెట్టుకుని రెవ్యూ శాఖకే నియోజకవర్గంలో సమాంతర వ్యవస్థ నడిపిస్తున్నారట ఆ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎక్కడుంది. ఎక్కడ జాగిర్దారీ భూములున్నాయి? ఎక్కడ చెరువు భూములు ఉన్నాయో లెక్కలు తీయడమే ఆ రిటైర్డ్‌ ఉద్యోగి పనట.

వివాదాల్లో ఉన్న భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేయడం ఎమ్మెల్యేకే చెందినట్లు నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకొంటారు. అసలే అధికార పార్టీ ఎమ్మెల్యే. దీనికితోడు రెవెన్యూ రికార్డుల గుట్టుమట్లు తెలిసిన ఉద్యోగి తోడు కావడంతో గొర్రల మందలో తోడేలు పడ్డట్టయిందని అంటున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ల్యాండ్‌ మంచింగ్‌ చేస్తున్న ఆ ఎమ్మెల్యేకు ఎప్పుడు బ్రేక్‌లు పడతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news