తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్ష స్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకెళుతున్నారు. ఓ వైపు అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో ఉన్న కీలక నాయకులని కాంగ్రెస్‌లోకి తీసుకోచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పలువురు నాయకులు కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ని వీడిన టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి చేరుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు, రేవంత్‌కు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
టీఆర్ఎస్‌లో వారు ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే చెప్పడం కాస్త కష్టమే అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉండొచ్చని చెబుతున్నారు. అది ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీని వదులుకుని ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడం కష్టమే అని మాట్లాడుతున్నారు.
ఎలా లేదన్న టీఆర్ఎస్ మరో రెండేళ్ళు పైనే అధికారంలో ఉంటుంది. అప్పటివరకు ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో కొనసాగి ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. పైగా ఖమ్మంలో టీఆర్ఎస్‌కు అంత అనుకూల వాతావరణం లేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు మళ్ళీ హస్తం గూటికి చెరోచ్చని చెబుతున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయో.