ఈటల రాజేందర్ (Etela Rajender) రాజకీయాలు ప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా తయారయ్యాయి. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌లో చేరుతారా లేక బీజేపీలో చేరుతారా? అసలు ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ వినిపించిన అనేక ప్రశ్నలకు నిన్న ఆయన ప్రెస్‌మీట్ ద్వారా సమాధానం చెప్పారు. తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన విసిరిన ప్రశ్నలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
ప్రగతి భవన్‌లో ఉన్న సీఎంవో అధికారుల్లో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా అంటూ ఈటల ప్రశ్నించారు. పెద్ద కుల అధికారులకే పెద్దపీట వేశారని, బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు కేసీఆర్ గౌరవం ఇవ్వట్లేదని ఈటల విమర్శించారు.
అయితే ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్ తర్వాత టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. కానీ ఎంతసేపు ఈటల రాజేందర్ వ్యవహారంపైనే వారంతా మాట్లాడారు తప్ప ఈటల రాజేందర్ విసిరిన సీఎంవో ఐఏఎస్ ఆఫీసర్ల విషయంలో మాత్రం మాట్లాడలేదు. అంటే దీన్ని బట్టి ఈటల అడిగిన ప్రశ్న నిజమే అని వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.