రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తులో కీలక విషయం బయటకు వచ్చింది. ఏఈ క్వశ్చన్ పేపర్ తో పాటు మరో నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను విశ్లేషించినప్పుడు కొన్ని ప్రశ్నాపత్రాలు బయటపడ్డాయని వెల్లడించారు.
అందులో ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు.. ఈ నెల 12, 15,16 తేదీల్లో జరగాల్సిన టౌన్‌ప్లానింగ్, వెటర్నరి అసిస్టెంట్ ప్రశ్నాపత్రాలున్నట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో ఈ నెల 5న నిర్వహించిన.. ఏఈ పరీక్షను టీఎస్పీఎస్సీ అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన మిగతా రెండు పరీక్షలను వాయిదా వేశారు.
ప్రవీణ్‌కు చెందిన 4 పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పెన్‌డ్రైవ్‌లలోని సమాచారాన్ని ప్రవీణ్ తన కంప్యూటర్లోకి కాపీ చేసుకొని.. అందులో ఏఈ ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ చేసుకొని రేణుకకు ఇచ్చినట్లు తేల్చారు. ప్రవీణ్ ఎన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కాపీ చేసుకున్నాడు.. వాటిలో ఏయే ప్రశ్నాపత్రాలు విక్రయించాడనే దానిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.