పేపర్ లీక్ మా వైఫల్యమే.. తప్పు నాదే అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఓ కీలక ప్రకటన చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకవడం తమ వైఫల్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. తప్పు జరిగిందని తాను అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉపాధ్యాయుల పాత్ర ఉందని తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్పై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
అసోంలో పదో తరగతి పరీక్షా పేపర్ లీకైన విషయం తెలిసిందే. సోమవారం (మార్చి 13) జరగాల్సిన జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్.. ఆదివారం రాత్రే బయటకు వచ్చినట్లు అసోం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సెబా) అధికారులు గుర్తించారు. వెంటనే పరీక్ష రద్దు చేశారు. మార్చి 30న జనరల్ సైన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
పేపర్ లీక్పై సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. వాట్సాప్లో పేపర్ లీక్ చేశారని.. ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు రూ.3000 వరకు వసూలు చేశారని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు.