మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో.. కుటుంబ సభ్యులకు ఉద్యోగం : టీఎస్‌ఆర్టీసీ

-

వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబంలోని భార్య లేదా కుమారుల్లో ఒకరికి ఉపాధిని కల్పించే ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విధి నిర్వహణలో జరిగిన ప్రమాదం కారణంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరవాత వివిధ వైద్య కారణాలతో ఉద్యోగం నుంచి వైదొలగిన వారి కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారు. మూడేళ్లపాటు ఏకమొత్తం చెల్లింపు ప్రాతిపదికన గ్రేడ్‌-2 డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టుల్లో వారిని నియమిస్తారు.  మూడేళ్ల సర్వీసు పూర్తి తరవాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్బంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఆరోజు రూ.120 ఉన్న టీ-24 టికెట్ ను కేవలం రూ.75లకే అందించాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రూ.75ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news