రెండ్రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమవుతోంది. ఏకధాటి వాన.. పొంగుతున్న నాలాలు.. చెరువులను తలపిస్తున్న రహదారులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే వర్షం వచ్చినప్పుడు ఎక్కడ చిక్కుకుంటామేమోనని భయంతో బయటకు వెళ్తున్నారు. ఇక ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నవారు రోజూ వర్షంలో తడిసిముద్దవ్వక తప్పడం లేదు. వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. నాలాల నీరు ఇళ్ల వద్దకు చేరి తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ శివారు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అధికారులు జంట జలాశయాల రెండు గేట్లు ఎత్తి వరదను మూసీలోకి వదిలారు. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 600, ఔట్‌ఫ్లో 442 క్యూసెక్కులుగా ఉంది.