ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అనేక యాప్‌లలో ఇప్పటికే పోస్టులకు లైక్, డిస్ లైక్ కొట్టే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అనేక సోషల్ యాప్‌లలో ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. అయితే ట్విట్టర్‌లో మాత్రం ఈ ఫీచర్ లేదు. కానీ త్వరలోనే ఓ మేజర్ అప్‌డేట్ ద్వారా ట్విట్టర్ ఈ ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ ప్రతినిధి సమాధానం చెప్పాడు.
ట్విట్టర్‌లో యూజర్లు చేసే ట్వీట్లను డిస్ లైక్ చేసేందుకు డిస్ లైక్ లేదా డౌన్ వోట్ బటన్‌ను త్వరలోనే అందివ్వనున్నారు. అయితే ఆ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వివరాలను వెల్లడించలేదు. కానీ ఆ ఫీచర్ మేజర్ అప్‌డేట్ రూపంలో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.
ట్విట్టర్‌లో జాకీ అనే యూజర్ పలు ఫీచర్లను అందించాలని అడగ్గా.. అందుకు కేవాన్ బెయక్‌పోర్ అనే ప్రతినిధి సమాధానం ఇచ్చాడు. ట్వీట్లకు డిస్ లైక్ లేదా డౌన్ వోట్ బటన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను ట్విట్టర్ ప్రస్తుతం పరిశీలిస్తుందని తెలిపాడు. అయితే ఇతర ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో యూజర్లు పెట్టే పోస్టులకు లైక్ బటన్‌తోపాటు డిస్ లైక్ బటన్ కూడా ఉంటే బాగుంటుందని, దీంతో యూజర్లు తమ అభిప్రాయాలను చెప్పేందుకు మరింత అవకాశం ఏర్పడుతుందని పలువురు యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్విట్టర్ ఆ ఫీచర్‌ను ఎప్పుడు ప్రవేశపెడుతుందో చూడాలి.