తెలంగాణతో పోలిస్తే ఆంధ్రా ఏమీ ఆర్థికంగా వెనుకంజలో లేదు. కానీ ఆ రోజు ఉన్న ఆర్థిక లోటునే ఇవాళ్టికీ చూపిస్తూ డ్రామాలు నడుపుతున్నాయి స్థానికంగా ఉంటున్న ప్రభుత్వాలు. అందుకు టీడీపీ కానీ వైసీపీ కానీ మినహాయింపు కాదు. రాష్ట్ర విభజన సమయంలో లోటు పదహారు వేల కోట్లు. ఈ మొత్తంను ఇచ్చేందుకు కేంద్రం ఎప్పుడో ఒప్పుకుంది కూడా ! ఇందులో భాగంగా కొంత పన్నుల సర్దుబాటు రూపంలో నిధులు ఇచ్చింది.
తరువాత రాజధాని నిర్మాణానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. తాను ప్రకటించిన విధంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తుంది కానీ కొన్ని కొర్రీలు మాత్రం వేస్తోంది. ఎందుకంటే సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఎప్పటికప్పుడు స్థానిక అవసరాల పేరుతో నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది కనుక! ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. అదేవిధంగా పంచాయతీలకూ నిబంధనల అనుసారమే నిధులు ఇస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మోడీ బొమ్మ వేయకున్నా నిధులు ఇస్తూ వస్తోంది. ఇన్ని చేసినా కూడా ఇంకా ఆదుకోవాలి అని పాత పాటే పాడుతున్నారు జగన్.
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా ? ఇదే ప్రశ్న చాలా మంది మదిలో మెదలుతోంది. నాలుగో తారీఖున కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి వెనువెంటనే ఢిల్లీకి వెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశాలేంటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మోడీ – జగన్ మధ్య గంటకు పైగా సమాలోచనలు జరిగాయి. అనేక అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇందులో రాజకీయ విషయాలు ఉన్నాయా లేదా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ పదే పదే మోడీని కలుస్తున్నారా అన్నది కూడా సందేహాస్పదమే!
వాస్తవానికి జిల్లాల ఏర్పాటు అన్నది కేంద్రం పరిగణనలోకి తీసుకోని విషయంగానే ఉంది. ఎందుకంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన సంబంధ నిర్ణయం. ఇందుకు పార్లమెంట్ ఆమోదం ఉండదు. నియోజకవర్గాల పునర్విభజన అన్నది జరగకుండా జిల్లాల విభజన అన్నది అశాస్త్రీయం.ఈ తరుణంలో మోడీ అనుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఏమీ లేవు. ఏకపక్ష నిర్ణయాల అమలు తరువాత ఆయన అనగా జగన్ తెలివిగా కేంద్రాన్ని కలిసి వస్తున్నారు. ఆపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేస్తున్నారు. వెళ్లిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానాలు చేసి జ్ఞాపికలు అందించి నవ్వులు చిందించి వస్తున్నారు. అటుపై ఓ మీడియా ప్రకటన ఉండదు అదేవిధంగా ఏం సాధించారో అన్నది ఎవ్వరికీ తెలియనివ్వరు. అంతా గోప్యం అంతగా రహస్యం.