ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఓ లెక్క అనే విధంగా రాజకీయం ఉండనుంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు హైద్రాబాద్ వెళ్లి వచ్చారని టాక్. మరికొందరు బెంగళూరు వెళ్లాలని అనుకుంటున్నారు. ఇంకొందరు ఢిల్లీకి పోయి వస్తే బెటర్ అని భావిస్తున్నారు. క్యాబినెట్ కూర్పు ఏ విధంగా ఉన్నా అసంతృప్తతలను చల్లార్చడం అన్నది జరగని పని. ముఖ్యంగా సీనియర్లను మళ్లీ తీసుకున్నా కూడా ఇప్పుడున్న 26 జిల్లాలకూ ప్రాధాన్యం ఇచ్చినా కూడా జగన్ కు కొత్త తలనొప్పులు తప్పవు.
అందుకే జగన్ తనదైన శైలిలో కొందరికి పార్టీ పనులు అప్పగించేందుకు సిద్ధం అవుతున్నారు. బొత్సకు, కొడాలికి మళ్లీ ఛాన్స్ ఇస్తారు. బొత్స సీనియర్ కనుక ఆయన పేరు మరోసారి ఫిక్స్ చేశారు. అదేవిధంగా చంద్రబాబును అదే పనిగా తిడతాడు కనుక కొడాలికి మరో సారి బెర్తును కన్ఫం చేశారు. వీరితో పాటు తానేటి వనిత పేరు అనూహ్యంగా రావడం విడ్డూరం. మంత్రిగా ఏపాటి ప్రభావం చూపని వనితను మళ్లీ ఏ విధంగా ఎంపిక చేశారో అన్నది అందరికీ ఆసక్తికరంగా ఉంది. ఆమె ప్రస్తుతం స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
మొన్నటి వేళ అందరితో పాటు ఆమె కూడా రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు పునర్వ్యస్థీకరణలో భాగంగా జగన్ 2.0 వెర్షన్ క్యాబినెట్ లో ఆమెకు చోటు ఇచ్చారు. ఆమెతో పాటు శంకరనారాయణ (ఆర్ అండ్ బీ మినిస్టర్, పెనుకొండ ఎమ్మెల్యే, ఉమ్మడి అనంతపురం జిల్లా) ను కూడా కొనసాగిస్తారు అన్న వార్తలొచ్చాయి. పెద్దిరెడ్డి ని కూడా కన్ఫం చేశారు. సీనియర్ల కోటాలో ఆయన ఉంటారు. అదేవిధంగా సీదిరి అప్పల్రాజుకు మరోసారి అవకాశం ఇచ్చారని టాక్. ఎందుకంటే ఆయన పదవి అందుకుని సరిగ్గా ఏడాదిన్నర కాలమే అయింది. 2020 జూలైలో ఆయన పదవి అందుకున్నారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను కూడా సీఎం జగన్ కొనసాగించనున్నారు అని టాక్.
ఇక పదవుల పందేరంలో రజనీ, రోజా ఉన్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. అదేవిధంగా చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు పదవులు వచ్చే వాళ్లంతా బాగానే ఉంటారు. రాని వాళ్లకు క్యాబినెట్ హోదాలో జిల్లాలకు అధ్యక్షులుగా చేయనున్నారు అని సమాచారం. వాళ్లే పార్టీ బాగోగులు చూడాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వారికి అప్పజెప్పిన బాధ్యతలు సజావుగా పూర్తి చేస్తేనే 2024లో మంత్రి పదవులు దక్కే వీలుంది. ఈ తరుణంలో పదవి రాని వారంతా జగన్ పై తిరుగుబాటు చేసే వీలు కూడా ఉంది. అదే కనుక జరిగితే ఆ వ్యూహాన్ని జగన్ ఏ విధంగా తిప్పికొడతారో ఇప్పుడిక ఆసక్తిదాయకం.