ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా దేశాల్లో కోవిడ్ 19 టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. భారత్‌లో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చి 1వ తేదీ నుంచి చేపట్టారు. అయితే కోవిడ్ టీకాల పంపిణీ నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ సమాచార వ్యాప్తిని నిరోధించడానికి ట్విట్టర్ నడుం బిగించింది. తప్పుడు సమాచారాన్ని షేర్ చేసే వారిపై ట్విట్టర్ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
ట్విట్టర్లో ఇకపై కోవిడ్ మాత్రమే కాదు.. ఏ అంశంపై అయినా సరే తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే అలాంటి ట్వీట్లకు తప్పుడు వార్త అని ట్విట్టర్ లేబుల్ ఇస్తుంది. తరువాత ఆ ట్వీట్‌ను తొలగిస్తుంది. మొదటి సారి తప్పుడు సమాచారం షేర్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోరు. కానీ రెండు, మూడో సారి అలా చేస్తే యూజర్ అకౌంట్‌పై 12 గంటల బ్యాన్ విధిస్తారు. తరువాత మళ్లీ అలాగే చేస్తే 7 రోజుల పాటు అకౌంట్‌ను లాక్ చేస్తారు. ఆ తరువాత కూడా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ వెళితే అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేస్తారు.
కోవిడ్ టీకాల పంపిణీ నేపథ్యంలో తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ తెలియజేసింది. తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ తెలిపింది.