సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ లకు సీజేఐతో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వీరిద్దరూ ఇటీవల పదోన్నతులు పొందారు. వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య తొమ్మిది నెలల వ్యవధి తర్వాత పూర్తిస్థాయికి (34) చేరింది.
గత సోమవారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్తో జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. మరో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రలు సైతం సుప్రీం జడ్జీలుగా ప్రమాణం చేశారు.