మంత్రి కేటీఆర్ తో యూఏఈ రాయబారి భేటీ

-

మంత్రి కేటీఆర్ తో భారత్ లోని యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్మాలి సోమవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, నసీర్ అల్మాలికి వివరించారు. ఈ సందర్భంగా నసీర్ అల్మాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అనేక ప్రశంసలు కురిపించారు.

ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతుల వలన భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింత మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటి, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారికి వివరించారు. ఈ సందర్భంలో తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యూఏఈ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ లో ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్నారని.. నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని, అయితే యూఏఈ చట్టాల ప్రకారం నష్టపరిహారాన్ని బాధితుడి కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, దుబాయి రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news