ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి 34 రోజులు అవుతోంది. బలమైన రష్యా ముందు మూడు నాలుగు రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నా… ఉక్రెయిన్ బలగాలు రష్యాకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో రష్యా చేసేందేం లేక పలు నగరాలపై బాంబులు కురిపిస్తూ సర్వనాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా మరియోపోల్, ఖార్కీవ్ నగరాలను మసిదిబ్బలుగా మార్చింది రష్యా. ఉక్రెయిన్ కు 43 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. 5 లక్షల మంది నివసించే మరియోపోల్ నగరాన్ని నాశనం చేశాయి రష్యన్ బలగాలు.
ఇదిలా ఉంటే ఈరోజు టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. మూడు గంటల పాటు సాగిన చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు తెలుస్తోంది. కీవ్, చర్నీవ్ నగరాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి రష్యా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలు అర్థవంతంగా సాగాయని రష్యా అధికారులు చెప్పారు. అయితే ఉక్రెయిన్ భద్రత కోసం అంతర్జాతీయ హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది.