ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం మంత్రివర్గంలో మార్పులు అనేక కథనాలు వచ్చాయి గానీ, దీనికి సంబంధించి అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాకపోతే జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారు. దాదాపు 80 శాతం మందిని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది. నవంబర్ నెల పూర్తి అయితే రెండున్నర ఏళ్ళు పూర్తి అయిపోతాయి. అంటే డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జగన్ 100 శాతం మంత్రివర్గాన్ని మార్చేసి, కొత్తవారికి అవకాశం కల్పించనున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పేశారు. అంటే ఇప్పుడున్న 25 మందిని తీసేసి కొత్తగా 25 మందిని మంత్రివర్గంలో పెట్టనున్నారు.
కాకపోతే మంత్రివర్గం మొత్తాన్ని పక్కనబెట్టేయడం ఓకే గానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాగా ఆర్ధిక శాఖని నడిపించే సత్తా ఏ నాయకుడుకు ఉందని ఆలోచన వస్తే…అలాంటి నాయకుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరున్నారా? అని వెతుక్కోవాల్సి ఉంది. అసలు ఆర్ధిక మంత్రిగా బుగ్గన రాష్ట్రం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆర్ధిక పరమైన అంశాల్లో బుగ్గనకు మంచి అవగాహన ఉంది. ప్రత్యర్ధులు అడిగే లెక్కలకు ఎప్పుడైనా కౌంటర్ ఇచ్చే సత్తా ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నిధులు రాబట్టడానికి కూడా బుగ్గన బాగానే కష్టపడుతున్నారు.
ఇక అప్పులు కోసం బుగ్గన ప్రయత్నాలు ఎలా చేస్తున్నారో కూడా తెలిసిందే. మరి ఇలాంటి పరిస్తితుల్లో బుగ్గనని పక్కనబెట్టి మరొకరికి ఆర్ధిక శాఖని అప్పగిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. మరి చూడాలి జగన్…బుగ్గనని అసలు పక్కనబెడతారా? ఒకవేళ పక్కనబెట్టిన ఆయన ప్లేస్‌లో ఎవరిని తీసుకొచ్చి పెడతారో.