ఈటల రాకతో మా బలం పెరిగింది.. తెలంగాణలో ఇక బీజేపీదే అధికారం : కేంద్రమంత్రి

మాజీ మంత్రి ఈటల చేరికపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈటల రాకతో తమ బలం పెరిగిందని.. ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి చాలా మంది నాయకులు బిజెపిలో చేరనున్నారని పేర్కొన్నారు. ఈటల చేరికతో బిజెపి బలోపేతం కానుందని.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈటల స్థానం చాలా ప్రత్యేకమైందని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కాగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ జాతీయ కేంద్ర కార్యాలయంలో ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాషాయ కండువా కప్పారు.

ఈటలకు సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.