కరోనా మొదటి వేవ్ ప్రారంభం అయినప్పటి నుంచి తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్యను తప్పుగా చూపిస్తున్నారంటూ హైకోర్టు ఇప్పటికే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మరో షాకింగ్ రిపోర్టు బయటకు వచ్చింది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం చూపించిన కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువని, నిజానికి అంతకన్నా 10 రెట్లు ఎక్కువగానే మరణాలు సంభవించాయని వెల్లడైంది. ఈ మేరకు ది హిందూ దినపత్రిక తన నివేదికలో తెలిపింది.
కరోనా ఏప్రిల్ 2020లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో 3,275 మరణాలు సంభవించాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ 32,752 మంది చనిపోయి ఉంటారని ఆ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కూడా కచ్చితమైన లెక్కలు చెప్పాలని పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మొదటి వేవ్‌లో హైదరాబాద్‌లో కోవిడ్ మరణాల సంఖ్య 1535 అని లెక్కల్లో చెప్పారని, కానీ 18,400 మరణాలు సంభవించాయని నివేదికలో వెల్లడించారు. అలాగే 2021లో మొదటి 5 నెలల కాలంలో నగరంలో కోవిడ్ మరణాల సంఖ్య 1740గా చూపించారని, కానీ ఆ సంఖ్య 14,332 కన్నా ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ఇక 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నగరంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 18,420 గా ఉంటుందని, కానీ ఇంతకన్నా తక్కువగానే మరణాలను చూపించారని నివేదిక ద్వారా తేలింది. అయితే ఎప్పటికప్పుడు హైకోర్టు కచ్చితమైన లెక్కలను చెప్పాలని ఆదేశిస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.