ఇటీవలే కేంద్ర హోం శాఖ విడుదల చేసిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల ప్రకారం శుక్రవారం (జులై 31) రాత్రి తెలంగాణ ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సడలింపుల విషయంలో కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలు:
- ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత
- ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా సెంటర్లకు అనుమతి
- స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత
- సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్స్, మెట్రో రైలు మూసివేత కొనసాగింపు (కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం పరిస్థితులకు అనుగుణంగా వీటి ప్రారంభంపై నిర్ణయం)
- కంటైన్‌మెంట్ జోన్లలో అంక్షలు కొనసాగింపు
- రాజకీయ, క్రీడా, సామాజిక, సాంస్కృతిక సభలు, సమావేశాలకు అనుమతి లేదు
అలాగే ఇకపై అంతర్రాష్ట్ర ప్రయాణాలు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. ఇక పెళ్ళిళ్ళ విషయానికొస్తే.. ఇంతకు ముందు మాదిరిగానే 50 మంది ఆహ్వానితులతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవచ్చునని తెలిపారు. అంత్యక్రియల్లో 20 మంది వరకు పాల్గొనవచ్చని వెల్లడించారు.