చదువుల్లో చురుగ్గా లేని ఓ విద్యార్థిని, తోటి విద్యార్థులతో దండించి వార్తల్లోకెక్కిన యూపీ టీచర్ త్రిప్తా త్యాగి క్షమాపణలు చెప్పారు. ముస్లిం విద్యార్థిని హిందూ విద్యార్థులతో కొట్టించి మతపరమైన వివక్ష కనబర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు త్రిప్త త్యాగి తాను తప్పు చేసినట్లు అంగీకరించారు.
ఈ మేరకు సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో చేతులు జోడించి పదే పదే క్షమాపణలు కోరారు. ‘నేను తప్పు చేశాను. కానీ హిందూ-ముస్లిం వివక్ష చూపాలన్నది నా ఉద్దేశ్యం కాదు. నేను వికలాంగురాలిని. లేవలేని స్థితిలో ఉన్నందున హోం వర్క్ చేయని విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించాను. ఆ తర్వాత అతడు పాఠాలు నేర్చుకున్నాడు’ అని ముజఫర్ నగర్‌కు చెందిన నేహా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ 60 ఏళ్ల త్రిప్త త్యాగి వివరణ ఇచ్చారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియో ‘హిందూ-ముస్లిం’ సమస్యగా వైరల్ అయింది.తన వద్ద చదువుతున్న ముస్లిం విద్యార్థుల్లో చాలా మంది తల్లిదండ్రులు స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని, వారికి తాను ఉచితంగా బోధిస్తున్నట్లు వివరించారు. ముస్లిం విద్యార్థులను వేధించాలన్నది తన ఉద్దేశ్యం కాదని చెప్పారు. దెబ్బలు తిన్న ముస్లిం విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో త్రిప్త త్యాగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ స్కూల్‌ను మూసేసిన అధికారులు అందులో చదువుతున్న విద్యార్థులను సమీపంలోని ఇతర స్కూళ్లకు బదలాయించామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.