తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగే 199 అభ్యర్థులకు గానూ 155 మంది అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో.. టికెట్ ఆశపడి భంగపడ్డ నేతలు పక్క చూపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నారు. అయితే.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… బేషరతుగా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు భట్టి.
కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి పార్టీలోకి వస్తే ఎవరినైనా చేర్చుకుంటామన్నారు. అలాగే తుమ్మలకు ఆహ్వానం ఉంటుందన్నారు. ఆయనతో చర్చలు జరుగుతున్నాయా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అది పార్టీ అంతర్గత అంశమన్నారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మల్లు భట్టి ఖండించారు. దేశ హోంమంత్రిగా ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని భట్టి విక్రమార్క కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఒకటి అన్నారు.
అందుకే కేసులను నీరుగార్చారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చారో కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ తమ పథకాలను కాపీ కొడుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమ హయాంలో లాక్కున్న దళితుల భూములను తాము అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామన్నారు భట్టి విక్రమార్క.