– ట్రంప్‌ను తొలగించాల్సిందే నంటున్న పలువురు రిపబ్లికన్లు
– అభిశంసనం తీర్మానంపై నేడు ప్రతినిధుల సభలో ఓటింగ్
– సెనెట్‌లో 20 మంది రిపబ్లికన్లు మద్దతు పలుకుతారని న్యూయార్క్ టైమ్స్ కథనం
న్యూయార్క్ః ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ఓటమిపాలైన అగ్రరాజ్యం ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరుకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అక్కడి చట్టసభ సభ్యులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే మరో ఆరో రోజుల్లో ట్రంప్ అధ్యక్ష పదవికాలం ముగుస్తున్నప్పటికీ.. అంతకంటే ముందే ఆయనను గద్దే దించాలని సెనెట్ సభ్యులు ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ పై అభిశంసన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని స్వయంగా ట్రంపే ప్రొత్సహించినందుకు అక్కడి చట్టసభ కాంగ్రెస్‌కు చెందిన 211 మంది సంభ్యులు ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై నేడు ప్రతినిధుల సభలో ఓటింగ్ జరగనుంది.
సభలో డెమొక్రాట్లకు అధిక మెజార్టీ ఉన్నందున దీనికి అనుకూలంగా నిర్ణయం రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక యూఎస్ రాజ్యంగంలోని 25వ ఆర్టికల్ ప్రయోగించడానికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ట్రంప్ తొలగింపు మరింత తేలిక అవుతుంది. కానీ, ఇదివరకే ఆయన దీనిని వ్యతిరేకించారు.
ఇక న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ట్రంప్ అభిశంసనంపై పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. అధ్యక్షున్ని తొలగించడానికి ఆర్టికల్ 25 ను ప్రయోగించడానికి ఒకే చెప్పకపోవడంతో.. ప్రతినిధుల సభలో ఓటింగ్ తో పాటు సెనెట్‌లోనూ ట్రంప్‌కు సెగ తగలనున్నట్టు పేర్కొంది. సెనెట్‌లో దాదాపు 20 మంది రిపబ్లికన్ సభ్యులు అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
అయితే, సెనెట్‌లో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, సెనెట్‌లో ఇరు పక్షాలకు చెరో 50 మంది సభ్యులు ఉన్నారు. తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండొంతుల మంది సభ్యులు సమర్థించాల్సి ఉంటుంది. రిపబ్లికన్లలో ఎంత మంది అభిశంసనకు ఒకే చెబుతారనేదానిపై సందిగ్ధం నెలకొంది. కానీ రిపబ్లికన్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరుగాంచిన లిజ్‌చెనీ అభిశంసనకు మద్దతు తెలపడంతో పాటు.. ట్రంప్‌పై ఘాటు విమర్శలు చేశారు. మరికొంత మంది నేతలు సైతం ట్రంప్ తొలగింపునకు అనుకూలంగా బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు. అయితే, అమెరికా చరిత్రలోనే అవమానకరంగా ట్రంప్‌ను అధికారపీఠం నుంచి దిగిపోవాల్సి వస్తుందా? రాదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇదిలా ఉండగా.. అన్ని వైపులా నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ.. అధ్యక్ష పదవికాలం ముగియకముందే అధికార పీఠం నుంచి దిగిపోయే ప్రసక్తే లేదని ట్రంప్ తెగెసిచెప్పారు. తన పదవికాలం పూర్తి అయ్యే వరకూ రాజీనామా చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. డెమొక్రాట్లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనీ, దీనిలో భాగంగానే తనపై అభిశంసన తీర్మానం పెట్టారనీ, ఇది దారుణమైన విషయమని ట్రంప్ పేర్కొన్నారు.
ఏదేలా ఉన్నా అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా ట్రంప్ మాదిరిగా ప్రపంచంలోనే అధిక దేశాల నుంచి ఆరోపణలు , విమర్శలు ఎదుర్కొలేదు. దేశంలోని ప్రజలు. నాయకులు సైతం ఆయన తీరును తప్పుబడుతున్నారు. మరీ ముఖ్యంగా క్యాపిటల్ భవనంపై దాడిచేయడంలో అధ్యక్షుని హస్తం వుందని వస్తున్న ఆరోపణలతో అమెరికా యావత్ ప్రపంచం ముందు నగుబాలు కావడంతో పాటు అక్కడి ప్రజాస్వామ్యంపై అనేక ప్రశ్నలను వేవనేత్తింది ! దీనికి కారణం ట్రంప్ అనే విషయం సుస్పష్టమే..!