చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెదికినట్లు.. అనే సామెత గుర్తుంది కదా.. అవును.. అయితే కరోనా వ్యాక్సిన్‌కు కూడా ఇప్పుడు అదే సామెత వర్తిస్తుందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే.. BCG అనే ఓ వ్యాక్సిన్ ఇప్పుడు కరోనాపై పోరాటం చేసేందుకు సైంటిస్టులకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు తాజాగా చెప్పిన విషయాలు.. అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అమెరికాలోని New York Institute of Technology (NYIT) సైంటిస్టులు BCG వ్యాక్సిన్‌పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరకు వారు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు. అదేమిటంటే.. BCG వ్యాక్సిన్ తీసుకుంటున్న దేశాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, అది తీసుకోని అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేల్చారు. నిజానికి BCG వ్యాక్సిన్ అనేది మనకు కొత్త కాదు. దీన్ని భారత్ ఎప్పటి నుంచో ఉపయోగిస్తోంది. అలాగే జపాన్, బ్రెజిల్‌లు కూడా ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లాగే గత 100 ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నాయి. అందుకనే ఆ దేశాలతోపాటు భారత్‌లోనూ ఇప్పుడు కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. ఇక ఈ వ్యాక్సిన్‌ను అప్పుడే పుట్టిన పిల్లలకు ఇస్తారు. దీంతో టీబీ రాకుండా ఉంటుంది. అయితే టీబీ వ్యాధి రావడం లేదని చెప్పి అమెరికా, యూరప్ దేశాల్లో దీన్ని తీసుకోవడం మానేశారు. దీంతో ప్రస్తుతం అవే దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సైంటిస్టులకు ప్రస్తుతం BCG వ్యాక్సిన్.. కరోనాపై పోరాటానికి ఓ ఆశాకిరణంలా కనిపిస్తుందని అంటున్నారు.
టీబీ వ్యాధి Mycobacterium tuberculosis అనే ఓ బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో దగ్గు, జ్వరం, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడం చాలా కష్టతరమవుతుంది. అయితే కరోనా వైరస్ లక్షణాలు కూడా ఇంచు మించు దాదాపుగా ఇలాగే ఉండడం విశేషం. ఇక గతంలో సార్స్‌పై కూడా BCG వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసింది. అయితే ప్రస్తుతం కరోనాకు, సార్స్‌కు కాస్త దగ్గర పోలికలు ఉండడంతో.. BCG వ్యాక్సిన్ కరోనాకు కూడా పనిచేస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని, అవి విజయవంతమైతే.. మన దగ్గర ఉండే BCG వ్యాక్సిన్‌తోనే కరోనా రోగులకు వ్యాధిని నయం చేయవచ్చని.. హైదరాబాద్ CSIR-Centre for Cellular and Molecular Biology (CCMB) డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ఇక ఆ పరిశోధనలు విజయవంతం కావాలని మనమూ కోరుకుందాం..!