జుట్టు పలచబడటం, పొడిబారిపోయి నిగారింపు కోల్పోవడం, పెరుగుదల లోపం మొదలైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఈ సమస్యలకి చాలా రకాల కారణాలున్నాయి. విటమిన్ల లోపం, హార్మోన్లలో తేడాలు, వాతావరణ కాలుష్యం మొదలగు వాటివల్ల జుట్టుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఇంట్లోనే ప్రకృతి వైద్యం చేసుకునే వీలుందని మీకు తెలుసా?
ఒత్తైన జుట్టు, అందమైన నిగారింపు కోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
మందార, కలబంద..
ప్రకృతి వైద్యంలో ఎంతో విశిష్టత కలిగిన ఈ రెండు, శిరోజాల సమస్యకి చక్కటి పరిష్కారాన్ని సూచిస్తాయి. వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. పెరట్లో దొరికే ఈ రెండు మొక్కలు ఒత్తైన జుట్టుని తిరిగిపొందేలా చేస్తాయి. కాకపోతే ఈ రెండింటినీ ఎలా వాడాలో తెలుసుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల మందార పొడి, ఒక టేబుల్ స్పూన్ కలబంద రసాన్ని తీసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకుని జుట్టుకి బాగా మర్దన చేసుకోవాలి. పాపిడి మొదటి నుండి చివరిదాకా బాగా మర్దన చేసుకుని షవర్ కవర్ తో దాన్ని కప్పుకుని 30నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఆ తర్వాత నీటితో జుట్టుని బాగా శుభ్రపర్చుకోవాలి.
మందారలో ఉండే ఫాస్పరస్, విటమిన్ సి, రైబో ఫ్లోవిన్, కాల్షియం మొదలగునవి జుట్టుని ఒత్తుగా చేయడంలో సాయపడతాయి. జుట్టు ఎండిపోయి పొడిబారకుండా ఉండేందుకు సాయపడి శిరోజాలు మెరిసేందుకు ఉపయోగపడుతుంది.
కలబందలో ఉండే అధికశాతం నీటి కారణంగా పాపిడి భాగం చల్లబడుతుంది. చుండ్రుని పోగొట్టి ఆరోగ్యకరమైన శిరోజాలని అందిస్తుంది.