సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ యూజర్లకు షాక్ ఇచ్చింది. గూగుల్ ఫొటోస్‌లో ఇక యూజర్లు అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ను వాడుకునేందుకు కుదరదు. ఈ మేరకు గూగుల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచి ఈ రూల్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో గూగుల్ ఫొటోస్‌లో యూజర్లు ఇక అన్ లిమిటెడ్ ఫొటోలు, వీడియోలను స్టోర్ చేసుకోవడం కుదరదు.
అయితే అప్పటి వరకు ఫొటోస్‌లో ఉండే ఫొటోలు, వీడియోలకు సదరు రూల్ వర్తించదు. ఆ తేదీ నుంచి అప్‌లోడ్ చేసే ఫొటోలు, వీడియోలకే ఆ రూల్ వర్తిస్తుంది. అంటే ఆ తేదీ తరువాత యూజర్లు గూగుల్ ఫొటోస్ లో అప్‌లోడ్ చేసే ఫొటోలు, వీడియోలకు స్టోరేజ్ లిమిట్ ఉంటుందన్నమాట. సాధారణంగా గూగుల్ ప్రతి అకౌంట్‌కు 15జీబీ ఉచిత స్టోరేజ్‌ను అందిస్తుంది. ఫొటోస్‌కు కూడా అదే లిమిట్ వర్తిస్తుంది. ఆ లిమిట్ వరకు మాత్రమే ఫొటోస్‌లో ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. లిమిట్ దాటితే యూజర్లు నిర్దిష్ట మొత్తం రుసుము చెల్లించి గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌లో యూజర్లకు పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.130తో ప్లాన్ తీసుకుంటే 100 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. అదే రూ.210 అయితే 200 జీబీ స్పేస్ ఇస్తారు. నెలకు రూ.650 చెల్లిస్తే 2 టీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ ప్లాన్లను కుటుంబంలోని ఇతరులతో కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే ఇదే కాకుంగా మైక్రోసాఫ్ట్ కు చెందిన డ్రాప్ బాక్స్, యాపిల్ తదితర ఇతర సంస్థలు కూడా నెల నెలా రెంటల్‌కు స్టోరేజ్‌ను అందిస్తున్నాయి. వాటిని కూడా అవసరం అనుకుంటే యూజర్లు డబ్బులు చెల్లించి ఉపయోగించుకోవచ్చు.