రాజకీయంలో సంచలనం సృష్టిస్తున్న నియోజకవర్గం.. తరచుగా మీడియాలోకి వస్తున్న నియోజకవర్గం.. కృష్ణాజిల్లా గన్నవరం. ఇక్కడ వరుస విజయాలు సాధించారు.. టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్. గత ఏడాది జగన్ సునామీ.. వైసీపీ వరదలను కూడా తట్టుకుని టీడీపీ టికెట్‌పై గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, కారణాలు ఏమైనా.. కొన్నాళ్ల కిందట వైసీపీ సానుభూతిపరుడిగా చేరారు. అయితే.. అప్పటికే ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు, వంశీపై ఓడిపోయిన నేత యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో దుట్టా రామచంద్రరావు వర్గం కూడా .. వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వంశీ గ్రూపు రాజకీ యాలు చేస్తారని, ఆయన వల్ల వైసీపీకి ఎలాంటి ప్రయోజనం లేదని. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించారని.. ఇలా అనేక రూపాల్లో వంశీని వ్యతిరేకించారు దుట్టా. అంతేకాదు, వచ్చే ఎన్ని కల నాటికి తనే ఇక్కడ నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తానని చెప్పారు. ఇలా వస్తున్న వ్యతిరేకతను కట్టడి చేసేందుకు వంశీ ప్రయత్నించారు. తాను అందరికీ అండగా ఉంటానని, అందరినీ కలుపుకొని పోతానని ఆయన చెబుతూ వచ్చారు.
అయినప్పటికీ ఇక్కడ రాజకీయ వ్యతిరేకతకు అడ్డుకట్ట పడడంలేదు. దీంతో రెండు వ్యూహాలు అనుసరిం చాలని వంశీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఒకదానిని ఆయన అప్పుడే అమల్లో కూడా పెట్టారని అంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గం వ్యాప్తంగా.. తనకు మద్దతిస్తున్న కుల సంఘాలు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలతో సమావేశాలు పెట్టించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే అమల్లో పెట్టారు. ఇప్పుడు గన్నవరంలో రోజుకో చోట సమావేశం జరుగుతోంది.
వంశీకి మద్దతుగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. అంటే.. వైసీపీలోకి రావడాన్ని వ్యతిరేకించవద్దంటూ.. వారు చెబుతున్నారు. ఇది వంశీకి ఒకింత రిలీఫ్ ఇస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక, రెండో వ్యూహం . తన వైఖరిని సీఎం జగన్‌కు స్పష్టం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ వివాదానికి సీఎం జగన్ జోక్యంతో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వంశీ అనుకుంటున్నారు. వ్యూహం అయితే.. బాగున్నా.. అటు యార్లగడ్డ, దుట్టా వర్గీయుల ఒత్తిళ్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి.
ముఖ్యంగా యార్లగడ్డ సర్దుకు పోయినా.. దుట్టా మాత్రం వంశీని వ్యతిరేకిస్తునే ఉన్నారు. దీంతో గన్నవరం పంచాయతీ ఎప్పటికి తీరుతుందోనని అంటున్నారు పరిశీలకులు. కానీ, ఎట్టిపరిస్థితిలోనూ వైసీపీ నేతలతో జై కొట్టించుకునేందుకు వంశీ వ్యూహంపై వ్యూహం పన్నుతూనే ఉన్నారని అంటున్నారు.. ఆయన మద్దతు దారులు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
-vuyyuru subhash