ఏప్రిల్ 8న తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ ప్రారంభోత్సవం!

-

సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అయిన వందేభారత్ తెలుగు రాష్ట్రాలకు మరోటి రానుంది. ఏపీ, తెలంగాణల మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల సమాచారం. నిర్వహణపరమైన ఏర్పాట్లతో అందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్ల అధికారులకు గురువారం రాత్రి సమాచారం అందించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రధాని నరేంద్రమోదీ సంక్రాంతి రోజున ప్రారంభించిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. మూడు నాలుగువారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్‌ దొరకదు. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని నిర్ణయించింది.

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ,  నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్‌-కర్నూలు, వికారాబాద్‌-తాండూరు-రాయచూరు.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఏయే స్టేషన్లలో ఆగుతుంది, ఛార్జీలు, ప్రయాణ సమయంపై స్పష్టత రావాల్సి ఉంది.  వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్‌ 8న ప్రారంభించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news