వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి కొద్ది సేపటి క్రితమే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపారు. గత కొద్ది కాలంగా వైసీపీలో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడంతో పాటు, అధినేత జగన్.. విజయవాడ సెంట్రల్ సీటుపై ఎటూ తేల్చకపోవడంతో ఆయన పార్టీ వీడినట్లు తెలుస్తోంది. రాధా పార్టీ నుంచి వెల్లిపోతే బెజవాడలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడక తప్పదని భావించిన అధిష్టానం సీనియర్ నేత బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపి ఆయనతో చర్చలు జరిపారు అయినప్పటికీ రాధాకృష్ణ శాంతించలేదు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాధాకృష్ణ ఆసక్తి చూపుతూ తన కేడర్ ను పటిష్టం చేసుకుంటున్న తరుణంలో సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలను వైకాపా అధ్యక్షుడు జగన్ … మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైనా రాధాకృష్ణ పార్టీ నిర్ణయంపై గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. అయితే జగన్ ప్రజా సంకల్ప పాద యాత్ర ముగిసిన అనంతరం రెండు మూడు సార్లు ఆయనతో చర్చించేందుకు ఆసక్తి చూపగా..పార్టీ సరైన విధంగా స్పందిచలేదు. దీనికి తోడు తన తండ్రికి ఉన్న ఇమేజ్, మాస్ ఫాలోయింగ్ కేడర్ రాధాను సరైన నిర్ణయం తీసుకోమని గత కొద్ది రోజులుగా ఒత్తిడి చేయడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాధా రాజీనామాతో ఒక్క సారిగా బెజవాడ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.