దేశంలోని వాహనదారులకు పెట్రోలియం కంపెనీలు శుభవార్త చెప్పాయి. ఇకపై అత్యంత శుభ్రమైన (క్లీనెస్ట్) పెట్రోల్, డీజిల్‌ను వారు కొనుగోలు చేయవచ్చు. బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్, డీజిల్‌ను ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ పంపుల్లోనూ విక్రయించనున్నారు. అయితే వాటి ధరలను మాత్రం పెంచలేదని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కేవలం బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయం విదితమే. అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బీఎస్ 4 వాహనాల అమ్మకాలు ఆగిపోవడం వల్ల ఏప్రిల్ 14వ తేదీన లాక్డౌన్ అనంతరం మరో 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాలను అమ్ముకునేందుకు సుప్రీం కోర్టు వాహన డీలర్లకు అనుమతి ఇచ్చింది. అయితే వాహనాలకు అప్పటి వరకు గడువు ఉన్నప్పటికీ బుధవారం నుంచే బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్, డీజిల్‌ను దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లోనూ విక్రయిస్తున్నారు. దీంతో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం స్థాయిలు ఇంకా తగ్గనున్నాయి.
అయితే బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న ఇంధనాన్ని అమ్ముతున్నా.. ఇంధన ధరలను మాత్రం పెంచలేదని.. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినందున ఇంధన ధరలను పెంచలేదని.. చమురు సంస్థలు తెలిపాయి. ఇక ప్రస్తుతం అమ్ముతున్న ఇంధనంలో సల్ఫర్ స్థాయిలు కేవలం 10 పీపీఎం వరకు మాత్రమే ఉంటాయని ఆ సంస్థలు తెలిపాయి. కాగా 2010లో భారత్ యూరో-3 ప్రమాణాలను అనుసరించడం మొదలు పెట్టింది. అప్పుడు ఇంధనంలో సల్ఫర్ స్థాయిలు 350 పీపీఎం వరకు ఉండేవి. ఆ తరువాత బీఎస్ 4 ప్రమాణాలను అమలు చేశాక.. ఇంధనంలో సల్ఫర్ స్థాయిలు 50 పీపీఎంకు పడిపోయాయి. ఇక ఇప్పుడు బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న ఇంధనంలో సల్ఫర్ స్థాయి మరింత పడిపోయి 10 పీపీఎంకు చేరుకుంది. దీంతో బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న ఇంధనం వల్ల.. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని చమురు సంస్థలు వెల్లడించాయి.
అయితే బీఎస్ 6 ప్రమాణాలు ఉన్నప్పటికీ ఆ ఇంధనాన్ని బీఎస్ 4 వాహనాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 68,700 పెట్రోల్ పంపుల్లో బుధవారం నుంచి బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్, డీజిల్‌లను విక్రయించడం ప్రారంభించారు. ఇక ఈ విషయంలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరనుంది. ప్రపంచంలో ప్రస్తుతం ఈ ప్రమాణాలు ఉన్న ఇంధనాన్ని విక్రయిస్తున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఆ దేశాల సరసన భారత్ చేరనుంది.