దేశమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉంది. ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా పరిస్థితి అనుకూలంగా ఉంది. కొన్ని సత్వర నిర్ణయాలు ఈ విపత్తు నుండి భారత్‌ను కాపాడగలవు.
ఈ కింది పది పాయింట్లు భారత ప్రభుత్వం వెంటనే చేపడితే కరోనా ప్రతికూలతలనుండి కొద్దిపాటి నష్టంతో కోలుకునే అవకాశముంది.
- ఇంతకుముందెన్నడూ భారత్ చూసిఉండని అతిపెద్ద విపత్తుగా గుర్తించడం. అలసత్వంలో జీవించొద్దు.
- ఒక 2 లక్షల కోట్ల రూపాయలను కరోనాతో యుద్ధానికి కేటాయించాలి. ఇంకా ఎక్కువగా కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. గతంలో కార్పొరేట్ కంపెనీలకు సైతం 1,40,000 కోట్ల టాక్స్ సడలింపు ఇచ్చిన సంగతి మరవొద్దు. దానికంటే ఇది చాలా చాలా ముఖ్యం.
- కరోనా వైరస్ పరీక్షలు, చికిత్సలను ఉచితంగా చేయాలి. భారత ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉండాలి.
- కరోనా వైరస్ దాడి తీవ్రత తెలియాలంటే, విరివిగా పరీక్షలు చేయాలి. కనబడని శత్రువుతో యుద్ధం చేయలేమని గుర్తించాలి. దక్షిణ కొరియా నమ్మిన ఇదే సూత్రాన్ని అమలుచేసి, ప్రయివేటు రంగాన్ని కూడా టెస్టులకు అనుమతించాలి. మీనమేషాలు లెక్కించకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెస్టింగ్ కిట్లను భారత్‌లోని నేరుగా తీసుకురావాలి. ఎటువంటి క్లియరెన్స్‌ల కోసం వేచిచూడొద్దు.
- ప్రయివేటు ఆస్పత్రులను కొరోనా రోగులకు చికిత్స అందించేందుకు వెంటనే అనుమతించాలి.
- కరోనా అనుమానితుల పరీక్షలకు ఇంటి వద్దే సాంపిల్స్ సేకరించాలి. వారందరూ ల్యాబ్‌లకు వస్తే వ్యాధి వ్యాపించే అవకాశముంటుంది.
- కరోనా కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఈ కింది విధంగా ఖర్చు చేయాలి…
- పేదలకు నెలకు రూ.5 వేల చొప్పున రాబోయే రెండు నెలలు ఇవ్వాలి.
- పరీక్షలు చేస్తున్న ప్రయివేటు ల్యాబ్‌లకు, చికిత్స చేస్తున్న ప్రయివేటు ఆస్పత్రులకు ఖర్చులు రియంబర్స్ చేయాలి ( పెద్ద కష్టం కాదు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇది అమల్లో ఉంది)
- వైద్య సిబ్బందికి రక్షణ పరికరాల (మాస్కులు, బాడీ సూట్లు) కొరత తీవ్రంగా ఉండే అవకాశముంది. వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకోవాలి. భారత్‌లో ఉత్పత్తి అయ్యే అవకాశముంటే ఆ కంపెనీలకు నిధులిచ్చి ప్రోత్సహించాలి.
- మన దగ్గర ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఆహారధాన్యాల నిల్వలను రాబోయే రెండు నెలలకు ఉచితంగా పేదలకు పంచాలి.
- చాలా వ్యాపారాలు మూతపడతాయి. పరిశ్రమలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. లక్షలాదిగా ఉద్యోగాలు పోతాయి. భారత పరిశ్రమలను, వ్యాపార-వాణిజ్యాలను కాపాడటానికి కేంద్రం వెంటనే ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి.
- ఐసీఎంఆర్ సహకారంతో విరివిగా పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ స్టేజి 3లోకి ప్రవేశించిందా? లేదా? అన్నది తెలుసుకోవాలి. ఒక వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్ నిర్వహించాలి. అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవడం మరవొద్దు.