భారతీయ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారినట్లు తెలిపారు. తాను రూ.6వేల కోట్లు బ్యాంకులకు బకాయి పడితే, భారతీయ బ్యాంకులు తన నుంచి రూ.14వేల కోట్లు వసూలు చేశాయని చెప్పారు. ఇది తాను చెల్లించాల్సిన మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ అని వెల్లడించారు.
ఆర్థిక మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక 2024-25లో ఉద్దేశపూర్వకంగా రుణం ఎగవేసిన వారి జాబితాలో విజయ్ మాల్యా ఉన్న విషయం తెలిసిందే. రుణ రికవరీ ట్రిబ్యునల్ ప్రకారం, విజయ్ మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సింది రూ.6,203 కోట్లు కాగా.. ఇండియన్ బ్యాంక్స్ మాత్రం తన నుంచి ఏకంగా రూ.14,131.8 కోట్లు వసూలు చేశాయని విజయ్ మాల్యా సంచలన ఆరోపణలు చేశారు. ఇది తన యూకే దివాలా రద్దు దరఖాస్తులో ఉందని.. మరి ఇంగ్లీష్ కోర్టులో బ్యాంకులు ఏం సమాధానిస్తాయో చూడాల్సి ఉందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.