తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడి చేసిన అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటి వరకు టికెట్ల వ్యవహారం పై జనసేన పార్టీ మరియు వైసీపీ ల మధ్య రచ్చ జరగగా…. ఇక ఇప్పుడు వైసిపి మరియు టిడిపి ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఏపీ రాజకీయాలపై మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న అధికార వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… తాజాగా మరోసారి ఆక్టివ్ అయ్యారు.
ఏపీ లో జరుగుతున్న పరిస్థితులపై టీడీపీ పార్టీపై మండిపడ్డారు. “సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అడ్రస్ గల్లంతవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. రెచ్చగొట్టే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. తాడు బొంగరం లేని వారు తమాషా చేస్తారు. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి.” అంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి.
ఇక అంతకు ముందు ట్వీట్ లో “ప్రజలు ఓడిస్తే తిరిగి వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు పోరాడాలి. వ్యవస్థల సపోర్టు ఉంది కదా అని ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటే రాజకీయంగా పుట్టగతులు ఉండవు. మతాలు, కులాలను రెచ్చగొట్టాలని చూశారు. ఇప్పుడు సీఎం గారిని అగౌవరపర్చి మంటలు పెట్టాలని చూస్తున్నారు. ఇవేవి ఎన్నికల్లో గెలిపించలేవు.” అంటూ టిడిపి కి చురకలు అంటించారు. అయితే ఎప్పుడు చంద్రబాబు పేరుతో ట్వీట్ చేసే విజయసాయిరెడ్డి… ఈసారి మాత్రం ఆయన పేరు లేకుండా చురకలు అంటించారు.