స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు విజనరీ కాదు.. ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని మండిపడ్డారు. అవినీతి సామ్రాజ్యంలో బాబు- రామోజీలది విడదీయలేని బంధమన్నారు. బాబు అరెస్ట్‌పై.. టీడీపీ సీనియర్లే నోరుమెదపడం లేదని ఆయన అన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నేతలను మద్దతు కోసం బతిమిలాడుకుంటున్నారన్నారు విజయసాయిరెడ్డి.
స్పెషల్ ఫ్లైట్లు పెడతాం.. వచ్చి సంఘీభావం తెలపండని వేడుకుంటున్నారని, ప్రజాభిమానం, చరిష్మా, నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తి బాబు అని ఆయన అన్నారు. ప్రజా బలం ఉంటే స్టేలు తెచ్చుకోకుండా విచారణను ఎదుర్కోవాలన్నారు బాబు నీతిమంతుడు అని భావిస్తే… ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ కోరాలన్నారు విజయసాయిరెడ్డి.
అంతేకాకుండా.. ‘కేసులన్నిoటిలో శిక్ష పడితే చంద్రబాబు జీవితాంతం బయటకు రాడు, విద్యార్థి దశ నుంచే చంద్రబాబు నేరస్వభావం గల వ్యక్తి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. నిన్న టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది…చివరికి హెరిటేజ్ సంస్థలు కూడా మూయలేదు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ సందర్భంగా ఆయన సచ్చీలుడు, మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడని నమ్మించే ప్రయత్నం ఒక మీడియా వర్గం ప్రయత్నం చేస్తోంది. దాంట్లో వాళ్లు పూర్తిగా వైఫల్యం చెందారు. చంద్రబాబు స్వతహాగా నేర స్వభావం, నేర ప్రవృతి కలిగిన వ్యక్తి. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన నీచరాజకీయాలు, అకృత్యాలు ఆయన స్వభావాన్ని తెలుపుతాయి. నేర స్వభావాన్ని, ఆలోచనలను వెనకేసుకు వచ్చే క్రమంలో ఆయన వర్గ మీడియా ఆయన సౌమ్యుడు, ఉదారస్వభావం ఉన్న విజనరీ అనే మెసేజ్ పంపాలని ప్రయత్నం చేశారు. దానిలో వాళ్లు విఫలమయ్యారు…అది నిజం కాదు అన్నది ప్రజలు కూడా గమనించారు.
డబ్బుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు. సీమెన్స్ అనే సంస్థ ఒక మల్టీ నేషనల్ కంపెనీ. ఆ కంపెనీ 90 శాతం ఇస్తుందో లేదో కూడా తెలియకుండా ప్రభుత్వ వాటాగా 10శాతాన్ని విడుదల చేశారు. రూ.370 కోట్లు విడుదల చేసి తన బినామీ ఎకౌంట్లో వేసుకున్న తీరు సీఐడీ కోర్టు ముందు పెట్టింది.
ఈ విషయంలో లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్ అనే వ్యక్తి కీలక భాగస్వామి. యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించినప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారు. రాజకీయాలు బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు. కాదని ఎవరైనా అంటే ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. రాజకీయాలను సామాన్యులకు దూరం చేస్తూ చంద్రబాబు ఓటుకు నోటు కేసు అందరూ చూశారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు.’ అని ఆయన అన్నారు.