టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టై.. రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు అరెస్ట్ కు దారితీసిన పరిణామాలపై టీడీపీ నేతలు గణాంకాలతో సహా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కిల్ డెవలప్ మెంట్ పథకం ముందుగా గుజరాత్ లో ప్రారంభమైందని పట్టాభిరామ్ తెలిపారు. గుజరాత్ లో 5 స్కిల్ సెంటర్లకు రూ.489 కోట్లను అప్పటి గుజరాత్ ప్రభుత్వం (నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నారు) కేటాయించిందని వెల్లడించారు పట్టాభిరామ్.
అదే సమయంలో సీమెన్స్ తో నాటి ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకుందని, స్కిల్ డెవలప్ మెంట్ కోసం రాష్ట్రంలో 42 సెంటర్లు, 6 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పట్టాభి వివరించారు. అందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.371 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. గుజరాత్ ప్రభుత్వం కంటే ఏపీ తక్కువే ఖర్చు చేసినా, వారి కంటే ఎక్కువ సంఖ్యలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పట్టాభిరామ్ తెలిపారు.
మరి, రూ.489 కోట్లు ఖర్చు చేసి 5 స్కిల్ సెంటర్లే ఎందుకు ఏర్పాటు చేశారో నరేంద్ర మోదీని అడిగే దమ్ము జగన్ కు ఉందా? అని పట్టాభి సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం గుజరాత్ లోనూ టెండర్లు పిలవలేదని, సీమెన్స్ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరించేలా ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. బైజూస్ తో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు టెండర్లు పిలిచారా? అని ప్రశ్నించారు. ఏం… కంటెంట్ ఇవ్వడానికి వేరే కంపెనీలే లేవా? బైజూస్ ఒక్కటే ఉందా? అని నిలదీశారు. మీరు ఒప్పందం కుదుర్చుకున్న బైజూస్ దివాళా తీసింది… ఆ కంపెనీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి… మరి సీమెన్స్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కదా! అంటూ పట్టాభి వ్యాఖ్యానించారు.