తెలంగాణకు “అమరరాజా”కంపెనీ తరలిపోవడంపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుదగ్గరపడేకొద్దీ తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారు. ఏ విషయంలోనైనా పొంతన లేని ‘వాస్తవాలు’ వెలికితీసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన బురదజల్లుతున్నారని ఆగ్రహించారు.
గుంటూరు టీడీపీ ఎంపీ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్ తన విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంపికచేసుకుంటే దానికి కారణం ఏపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల పత్రికలు చేస్తున్న అబద్ధాల ప్రచారం నాటి గోబెల్స్ ప్రాపగాండాను మించిపోయింది. కార్పొరేట్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఏ ప్రాంతంలో పెట్టాలనే విషయాన్ని నిర్ణయించడానికి వ్యాపార కారణాలనే మొదట, చివరా పరిగణనలోకి తీసుకుంటాయన్నారు. ఒక్కోసారి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఎన్ని రాయితీలు కల్పిస్తున్నా ఆ రాష్ట్రంలో ఒక పరిశ్రమ స్థాపనకు అన్ని వ్యాపార అంశాలూ అనుకూలంగా లేకుంటే ఏ కంపెనీ అయినా ఆ పని చేయదని పేర్కొన్నారు.
చెన్నై, బెంగళూరు, పుణె సమీపంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ తయారీ యూనిట్లు పెట్టడానికి పూర్తిగా వ్యాపార పరిస్థితులే కారణం. ఈ రెండు నగరాలకు ఉన్న మౌలిక సదుపాయాలే వాటి సమీప ప్రాంతాలకు కోరని వరాలుగా మారాయి. అంతేగాని, తమకు ఇష్టమైన రాజకీయపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఏ కంపెనీ కూడా తన యూనిట్లను పెట్టదు. ఈ విషయాలేమీ తెలియవన్నట్టు తెలుగుదేశం నేతలు, వారి అనుకూల మీడియా యజమానులు ఇప్పుడు ఈ బ్యాటరీల కంపెనీ విస్తరణ ప్రాజెక్టు వ్యవహారంలో మాట్లాడుతున్నారు. అసత్యాలతో కూడిన కథనాలు ప్రచారంలో పెడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి తమ ఎంపీ కంపెనీ ఉత్పత్తి చేసే బ్యాటరీలను చక్కగా వాడుకుంటున్నారు.మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగే పరిణామాలు కనపడవా? అని నిలదీశారు.