కాంగ్రెస్‌ను గెలిపించినా టీఆర్‌ఎస్‌లోనే చేరతారు

-

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ congress పార్టీ మాజీ ఇంఛార్జ్ కౌశిక్ రెడ్డి ఓ బీజేపీ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెల్సిందే. అయితే దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ… కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పార్టీ నుంచి బహిష్కరించగా… గంటల వ్యవధిలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసారు. దాదాపు 10 గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి.

అయితే కౌశిక్ రెడ్డి రాజీనామాపై మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. 2018లో కాంగ్రెస్ నుండి హుజూరాబాద్ లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఆ పార్టీ వద్దని రాజీనామా చేసారని గుర్తు చేస్తూ… కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని కౌశిక్ రెడ్డి చెప్పటం ఇప్పుడు అర్థం చేసుకోవలసిన పరిణామమని అన్నారు. కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్‌తో సాధ్యపడదనే అభిప్రాయంలో చాలా మంది నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెసుకు ఓటు వేసి గెలిపించినా టీఆర్‌ఎస్‌లోనే చేరతారని, ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం కళ్ళముందే ఉంది కదా! అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న టీపీసీసీ ప్రకటన కూడా మాటలకే పరిమితమయ్యేలా కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను లూటీ చేసి, అప్పుల్లో నెట్టిన టీఆర్‌ఎస్‌ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని విజయశాంతి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news