తెలంగాణకు సీఎం కేటీఆర్ అంటూ…విజయశాంతి హాట్ కామెంట్స్ చేశారు. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్ర అని నిన్న… దత్తత గ్రామాల్లో వెళ్లిన చోటికే వెళ్ళి ఆ మధ్య… ఇలా తన పిచ్చి ప్రకటనలు, మతిమరుపు వ్యవహారాలు, విఫల వాగ్దానాల మధ్య… తెలంగాణ ప్రజలతో ఇక చాలు బాబోయ్ అనిపించుకుంటున్న సీఎం కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు ఇటీవల స్పందిస్తూ… రాష్ట్రంలో కేసీఆర్ 3వ సారి కూడా సీఎం అయ్యి దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎంగా రికార్డ్ సృష్టిస్తారని వ్యాఖ్యలు చేశారని నిప్పులు చెరిగారు.
గతంలో దక్షిణాది రాష్ట్రం తమిళనాడుకు సీఎంగా ఉన్న ఎంజీఆర్ ఆల్రెడీ ఇలాంటి చరిత్ర సృష్టించారన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నరు. అయితే, ఈ క్రమంలో మనం గుర్తించాల్సిన అంశం మరొకటుంది. కేసీఆర్ ప్రస్తుత టర్మ్ పూర్తయ్యే లోపే కేటీఆర్‌ని సీఎం చేసేస్తారని టీఆరెస్ వర్గాలు పదే పదే చెబుతూ వచ్చాయి. తీరా చూస్తే, అది జరగలేదు సరికదా… వచ్చే టర్మ్ కూడా కేసీఆరే సీఎం అని కేటీఆర్ గారు అంటున్నరంటే… తనకు ఆ ఛాన్స్ లేదని తండ్రి కేసీఆర్ స్పష్టంగా సంకేతాలిచ్చినట్టు చెప్పకనే చెప్పారన్నారు.
ఇది చాలక వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ 90 సీట్లుకు పైగా గెల్చుకుంటుందని కూడా కేటీఆర్ అన్నరు. ఇప్పటికే కేసీఆర్‌తో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ఒకపక్క కొడుకుకి అవకాశం ఇవ్వని తండ్రి… మరోపక్క ఆ తండ్రి పట్ల నమ్మకం లేని ప్రజలు… ఈ పరిస్థితుల్లో టీఆరెస్‌కి 90 సీట్ల సంగతి దేవుడెరుగు… వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గతేంటో ముందు గ్రహించాలి. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కొంత సెన్సిబుల్‌గా వ్యవహరించే వ్యక్తిగా… ఆయన నాయకత్వంలో టీఆరెస్ రానున్న ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలిగే పరిస్థితులైనా ఉంటాయేమో గానీ, ఇదే గత్తర్ బిత్తర్ గందరగోళపు కేసీఆర్ గారి నేతృత్వంలో ఎన్నికలు అంటే టీఆరెస్‌కి డిపాజిట్లు కూడా కష్టమే అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నట్టు సమాచారమని పేర్కొన్నారు విజయశాంతి.