బిజెపి రాష్ట్ర నాయకత్వం పట్ల సీనియర్ నాయకురాలు విజయశాంతి అసంతృప్తితో ఉన్నారు. తనకు ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టలేదన్న ఆమె.. తన సేవలను ఎలా వాడుకుంటారనేది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం తనని నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. ఇటీవల సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో మాట్లాడదామనుకున్నప్పటికీ లక్ష్మణ్ వచ్చి మాట్లాడి వెళ్లిపోయారని.. తనకేమీ అర్థం కాలేదని అన్నారు.
తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు విజయశాంతి. పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోతే ఏం చేయగలుగుతామని ఆమె ప్రశ్నించారు. మరి రాములమ్మ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.