ఏపీ పరిస్థితులపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !

ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై విజయశాంతి స్పందించారు. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఊళ్ళను ముంచెత్తాయని… ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో అయినవారు కళ్ళముందే కొట్టుకుపోయారని తెలిపారు. ఇన్నాళ్ళూ తోడుగా ఉండి…. మన ఇంటి మనుషుల్లా… ప్రాణానికి ప్రాణంగా పెంచి పోషించుకున్న పశుసంపద మౌనంగా రోదిస్తూ జలప్రవాహంలో కలిసిపోయిందని వెల్లడించారు.

పిల్లాపాపల బేల చూపుల మధ్య… ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు విజయశాంతి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాలు తమ శాయశక్తులా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నప్పటికీ… ఈ విపత్కర సమయంలో సహాయక చర్యలు మరింత వేగవంతం కావాలంటే ఆ సిబ్బందికి తోడుగా మరికాస్త మానవవనరుల సహాయం అవసరమనిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి తోడుగా అవసరమైన చోట్ల ఎన్‌సీసీ విద్యార్థుల సహకారాన్ని కూడా తీసుకుంటే వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబడవచ్చన్నారు. చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నానని విజయశాంతి వెల్లడించారు.