ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కనకదుర్గ అమ్మవారు కూరగాయలు, పండ్లు రూపంలో శాకాంబరీ దేవిగా దర్శనమిస్తారు. దీంతో శాంకాబరీదేవి అవతారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొనేందుకు భక్తజనం ఇంద్రకీలాద్రిపై పోటెత్తింది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఇదిలాఉంటే.. బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పించడం ప్రతీయేటా ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఆదివారం తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల తరుపున దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనున్నారు.
ప్రతి ఏడాది ఆషాడ మాసంలో ఇంద్రకీలాద్రిపై శాకంబరీ దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శాకంబరీ దేవి గురించి దేవీ భాగవతంతో పాటుగా మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో ప్రస్తావన ఉంది. శాకాంబరీ దేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చుని.. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి ఉంటుంది. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.