విశాఖ మన్యంలో మరోసారి బాక్సైట్ భూతం అలజడి రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కు సిద్ధం అవుతుందే మోనన్నది… రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాల అనుమానం. ఇదే ఇప్పుడు వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీఓ 89 చుట్టూ రాజకీయం మొదలైంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి ఇది కాస్తా పొలిటికల్ బాక్సింగ్‌కు కారణం అవుతోంది.
వాస్తవానికి విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం 25ఏళ్ల క్రితమే బీజం పడింది. పాడేరు సబ్ డివిజన్ పరిధి లోని విస్తారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలను ఉపయోగించుకుని అల్యూమినా రిఫైనరీ ఏర్పాటుకు అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఆన్ రాక్ కంపెనీ ముందుకు వచ్చింది. మాకవరపాలెం మండలంలోని రాచపల్లిలో దాదాపు రెండు వేల ఎకరాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించి ఆ కంపెనీకి కేటాయించింది. ఇక్కడ సుమారు 4వేల కోట్లతో కంపెనీ ఏర్పాటైంది. చింతపల్లి మండలం జర్రెలలో వున్న 224 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలను ఏపీఎండీసీ ద్వారా తవ్వి సరఫరా చేసేలా 2008లో రెండు జీఓలు జారీ అయ్యాయి. వీటిని గిరిజనులతో పాటు మావోయిస్టులు వ్యతిరేకించడంతో ముందడుగు పడలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవో నెంబర్ 97 జారీ చేసింది. కానీ, బాక్సైట్ తవ్వకాల జోలికి మాత్రం వెళ్ళలేదు. ఇటు తాము అధికారంలోకి వస్తే బాక్సైట్ ఒప్పందాలను అన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటించిన వైసీపీ… మాట నిలబెట్టుకుంది. ఏపీఎండీసీకి చేసిన 617 హెక్టార్ల భూ కేటాయింపును రద్దుచేస్తూ జీఓ ఇచ్చింది. ఇక్కడితో అంతా కామ్ అయిపోయింది అనుకుంటే మరో రగడ మొదలైంది. రిఫైనరీ నిర్మాణం చేసి ఏళ్ళు గడిచిపోతున్నా ఒప్పందం మేరకు ప్రభుత్వం ముడిసరుకు ఇవ్వడం లేదని ఆన్ రాక్ యాజమాన్యం వివాదం లేవనెత్తింది. ఇందుకోసం జారీ అయిన GO నెంబర్ 89పై ఇప్పుడు టీడీపీతో పాటు గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి.
బాక్సైట్ తవ్వకాలు జరిపితే పర్యావరణం దెబ్బతింటుందని, వందలాది గ్రామాలు నామరూపాలు లేకుండాపోతాయని,అడవులు ఎడారిగా మారతాయని ఆందోళనలకు దిగుతున్నాయి గిరిజన సంఘాలు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు వారికి నచ్చజెప్పేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి తవ్వకాలు ఉండబోవని చెబుతున్న ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.
బాక్సైట్ సరఫరా చేస్తామని గతంలో అన్‌రాక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్బందం వివాదంలో పడింది. ఒప్పందం కుదుర్చుకున్న విధంగా ప్రభుత్వం బాక్సైట్ సరఫరా చేయలేదు కాబట్టి.. తమ కాంపన్సేషన్ చెల్లించాలని అన్ రాక్ సంస్థలో వాటాదారుగా ఉన్న రకియా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది కేంద్రం. ఇతర రాష్ట్రంలోని బాక్సైట్ గనులను అన్‌రాక్ సంస్థకు అప్పజెప్పడానికి అవకాశం ఉందా అనే అంశంపై కేంద్రంతో చర్చించనుంది ఏపీ ప్రభుత్వం.