రాజధానిలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. ఎక్కడో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో ఉన్న పలాస నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. గత ఏడాది జగన్ సునామీతో ఈ రెండు చోట్లా కొత్త నేతలు విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వారే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. వీరిద్దరి విషయంలో గత కొన్ని రోజులుగా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జగన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తుండడమే దీనికి కారణంగా కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం మరిన్ని విషయాలు జోడిస్తూ.. కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒకే రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అదే వైద్య వృత్తి. ఉండవల్లి శ్రీదేవి గైనకాలజీ స్పెషలిస్టు. హైదరాబాద్‌లో పెద్ద ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు. ఇక, సీదిరి అప్పలరాజు కూడా ఎంబీబీఎస్ జనరల్ ఫిజీషియన్. అయితే, గత ఏడాది ఎన్నికల్లో జగన్ పిలుపుతో ఇద్దరూ ఆయా నియోజకవర్గాల్లో నిలబడి విజయం సాధించారు. అప్పలరాజు అంతుకు ముందు కూడా నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అయితే, శ్రీదేవి మాత్రం అనూహ్యంగా తెరమీదికి వచ్చి గెలుపు గుర్రం ఎక్కారు.
అయితే, ఇప్పుడు వీరిద్దరి మధ్య కొన్ని కామన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయనేది సోషల్ టాక్. పార్టీ అధినేత జగన్‌ను కొనియాడడంలో ఈ ఇద్దరు నాయకులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారట! అసెంబ్లీలో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా డాక్టర్ శ్రీదేవి.. రాసుకొచ్చిన స్ర్కిప్టుతో జగన్‌ను పొగడడమే పనిగా ఉంటారని గతంలో అనేక వ్యాఖ్యలు ట్రోల్ అయ్యాయి. ఇక, అప్పలరాజు కూడా సభలో టీడీపీ నేత చంద్రబాబుపై సటైర్లు పేలుస్తూనే.. జగన్‌ను రాసుకొచ్చిన స్క్రిప్టుతో పొగడ్తలతో ముంచెత్తుతారనే టాక్ ఉంది.
ఇక, ఇప్పుడు లాక్‌డౌన్ నేపథ్యంలోనూ ఈ ఇద్దరు డాక్టర్ ఎమ్మెల్యేలు కూ డా తమ తమ నియోజకవర్గాల్లో జగన్‌ను తమదైన శైలిలో పైకెత్తుతున్నారనే వాదనవినిపిస్తోంది. వాస్తవానికి తమ పనులు తాము చేసుకుంటే జగన్ సంతోషిస్తారనే విషయం తెలిసి కూడా పొగడ్తలకే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పరిమితం కావడం.. నియోజకవర్గంలోనే కాకుండా.. పార్టీలోనూ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ తరహా రాజకీయాలు సుదీర్గ కాలం చెల్లుబాటు కాదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి వీరు తమ పంథాను మార్చుకుంటారో లేదో చూడాలి.